Sunday, January 5, 2025

పద్మనాయక మరియు రెడ్ల మధ్య వైరం కుమారగిరి రెడ్డి రాజ్య కాలం 1386 సంవత్సరం నుండి 1402 సంవత్సరం వరకు.

 కుమారగిరి రెడ్డి అనపోతా రెడ్డి పుత్రుడు కానీ అనపోతా రెడ్డి  మరణించే సమయానికి కుమారగిరి రెడ్డి చిన్నవాడు కావటం చేత రాజ్యాధికారం ఆయన చిన్న తమ్ముడైన అనవేమారెడ్డి చేపట్టాడు. అనవేముడి పాలన అనంతరం కుమారగిరి రెడ్డి రాజ్యాధికారానికి వచ్చాడు. కానీ ఇది సాఫీగా జరగలేదు. ఆయనను కొంత మంది ఎదిరించగా వారిని ఓడించి రాజ్యానికి వచ్చాడు కుమారగిరి. కానీ ఆయనను ఎదిరించినవారు ఎవరో చరిత్రలో ఎక్కడా రాయబడలేదు.

కుమారగిరి రెడ్డి తన బావ అయిన కాటయవేమా రెడ్డి ని అన్ని విషయాలకు సలహాదారుగా చూసాడు. కాటయవేమా రెడ్డి తండ్రి పేరు కాటయ రెడ్డి. ఆయన కుమారగిరి రెడ్డి మేనత్తను వివాహం చేసుకున్నాడు. తిరిగి కాటయ వేమా రెడ్డి కుమారగిరి రెడ్డి సోదరిని వివాహం చేసుకున్నాడు (మేనరికం).

ప్రోలయ వేమారెడ్డి అద్దంకి రెడ్డి రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఆయన అన్న అయిన  మాచ రెడ్డి ని రెడ్డి తన రాజ్యంలోని చందవోలు కు, తమ్ముడైన మల్లా రెడ్డి ని కందుకూరు కు రాజులను చేసాడు. మాచ రెడ్డి కొడుకు పెదకోమటి వేమా రెడ్డి. కుమారగిరి రెడ్డి, కాటయవేమారెడ్డి ని  ముఖ్య సలహాదారుగా చేసుకోవడం పెదకోమటి వేమారెడ్డి కి రుచించలేదు.

కాటయవేమా రెడ్డి ని సలహాదారుగానే కాకుండా దాదాపుగా మంత్రిగా చూడటం రెడ్ల పద్ధతికి విరుద్ధం ఎందుకంటే మంత్రులుగా వారు బ్రాహ్మణ వ్యక్తులనే నియమించేవారు. కుమారగిరి రెడ్డి  పద్ధతిని కొంతమంది సామంతులు సమర్ధించగా కొంతమంది వ్యతిరేకించడం వలన రాజ్యంలో అంతర్యుద్ధం వచ్చింది. కొంతమంది అప్పుడు కుమారగిరిని సమర్ధించగా కొంతమంది పెదకోమటివేముడిని సమర్ధించారు. చివరికి వారి ఇరువురి మధ్యన ఒక ఒప్పందం కుదిరింది కానీ దాని పూర్తి వివరాలు మనకు తెలియవు కానీ దాని ప్రకారం కుమారగిరికి సంతతి లేకపోతె పెదకోమటి రాజు అవుతాడు అన్నది ఒక ఒడంబడిక.  ఈ అంతర్యుద్ధం 1386  సంవత్సరంలో జరిగింది.

రెడ్డి రాజ్యంలో అంతర్యుద్ధాన్ని అదనుగా చేసుకొని విజయనగర రాజు అయిన హరిహర రాయలు II దాని మీద దండెత్తి ముందుగా త్రిపురాంతకాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత గుంటూరు జిల్లాలోని వినుకొండ వరకు విజయనగర సైన్యాలు పురోగమించాయి. ఈ దాడిలోనే విజయనగరం తాను ముందుగా అనవేమారెడ్డి కి కోల్పోయిన స్రిశైలం ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకొంది. 

తన రాజ్యంలో అంతర్యుద్ధం ముగియగానే కుమారగిరి విజయనగరం స్వాధీనం చేసుకున్న తమ భూభాగాన్ని తిరిగి విజయనగరం నుండి జయించడానికి కాటయవేముని పెద్ద సైన్యంతో పంపాడు. ఆ దండయాత్రలో భాగంగా విజయనగర సైన్యాలు అప్పటికే కొత్తకొండ వద్ద రాచకొండ మరియు బహమనీ సైన్యాలతో పెద్ద పరాజయం చెంది బలహీనపడి ఉన్నాయి. హరిహరరాయలు బహమనీ సుల్తానులతో మరియు పద్మనాయకులతో పోరాడడానికి పక్కన ఉన్న రెడ్డి రాజ్యంతో స్నేహం ముఖ్యం అని భావించి వారితో సంధి చేసుకున్నాడు. హరిహరరాయలు త్రిపురాంతకం, వినుకొండ రెడ్డి రాజ్యానికి తిరిగి ఇవ్వగా రెడ్డి రాజులూ శ్రీశైల ప్రాంతాన్ని విజయనగరానికి వదిలివేశారు. సంధిలో భాగంగా హరిహరరాయలు II  తన పుత్రిక హరిహరాంబ ను కాటయ వేమా రెడ్డి కి ఇచ్చి వివాహం చేసాడు.

రెడ్డి రాజుల లాగే రేచెర్ల ప్రభువులు కూడా వారి ప్రదేశాన్ని విస్తరించడానికి యుద్ధాలు చేసారు. వెలుగోటివారి వంశావళి ప్రకారం సింగభూపాలుడి పుత్రుడు అయిన మాదానాయక II కుమారగిరి రెడ్డి ని యుద్ధంలో ఓడించాడు. బహుశా ఇది అనపోతనాయక I  యొక్క కళింగ దండయాత్రలో జరిగి ఉండవచ్చును. అది 1381  సంవత్సరం లో అనపోతనాయక I  వేసిన సింహాచల శాసనం ముందు జరిగింది. ఈ యుద్ధంలో పెదవేదగిరి నాయకుడు, మాదానాయక II  పాల్గొన్నారు. వెలుగోటివారి వంశావళి ప్రకారం ఈ యుద్ధంలో  పెదవేదగిరినాయకుడు  తుని దగ్గర ఉన్న బెండపూడి దుర్గాన్ని జయించాడు. కానీ రెడ్డి రాజ్యం మీద ఇది ఒక పూర్తి విజయం కాకపోవచ్చును ఎందుకంటే రెడ్డి రాజ్యం పూర్తిగా పద్మనాయకుల చేతుల్లోనికి రాలేదు.      

ఏది ఏమైనా 1390  సంవత్సరానికి కుమారగిరి, కొండవీటి రెడ్డి రాజ్యాన్ని శాంతితో ఏలుతున్నాడు. అప్పటికి ఆయన తన శత్రువులను ఓడించడమో లేదా వారితో సంధి చేసుకోవడమో చేసాడు. కుమారగిరి పనుపున కాటయవేముడు కళింగ దండయాత్ర చేసాడు. బహుశా ఇది కాటయవేముని 1388  సంవత్సరంలోని సర్పవరం శాసనం సమయంలో జరిగింది. కుమారగిరి కాటయవేమునికి "కటకచూరకర " అనే బిరుదం ఇచ్చాడు అంటే  ఆయన తన కళింగ దండయాత్రలో కళింగలో Cuttack  వరకు చొచ్చుకుని  పోయాడు. ఈకళింగ  యుద్ధంలో కాటయవేముడు జయించిన గజపతి రాజు గంగ వంశానికి చెందిన నరసింహదేవ IV .కాటయవేమునితో పాటు ఈ దండయాత్రలో అల్లాడరెడ్డి పుత్రులైన వేమారెడ్డి మరియు దొడ్డారెడ్డి కూడా పాల్గొన్నారు. రెడ్డి రాజులు అందరిలోనూ కాటయవేమా రెడ్డి మహావీరుడు. 

కాటయవేముని ఈ దండయాత్ర వలన సింహాచలం వరకు ఉన్న కళింగ రాజ్యం రెడ్డి రాజ్యంచే జయించబడి దానిలో భాగం అయ్యింది. అది రాజమహేంద్రవర రాజ్యం అని పిలువబడింది. కుమారగిరి రెడ్డి తన పుత్రుడైన అనపోతా రెడ్డి II  ను రాజమహేంద్రవర రాజ్యానికి రాజును చేసాడు. అనపోతారెడ్డి II  రాజమహేంద్రవర  రాజ్యాన్ని అల్లాడ రెడ్డి సమర్దనతో పాలించాడు. కాటయవేముడు తన పుత్రిక అయిన అనితల్లి ని అల్లాడ రెడ్డి చిన్న కుమారుడైన వీరభద్రారెడ్డి కి ఇచ్చి వివాహం చేసాడు.

పద్మనాయక మరియు రెడ్ల మధ్య వైరం అనవేమా రెడ్డి రాజ్య కాలం 1364 సంవత్సరం నుండి 1386 సంవత్సరం వరకు.

 అనపోతానాయకుని పుత్రుడైన సింగమనాయకుడు II , మరియు మాదానాయకుని పుత్రుడైన వేదగిరినాయకుడు I ఇరువురు కూడా వారి తండ్రుల వలె కొండవీటి రెడ్లతో వైరం కొనసాగించారు.

ఇక్కడ తెలుగు చోడుడు అయిన భక్తిరాజు గురించి వివరంగా చెప్పాలి.

 ఈ భక్తిరాజు గురించి ఇంతగా చెప్పటానికి కారణం ఆయన పుత్రుడు అయిన  అన్నదేవ చోడుడు రాచకొండ రాజ్యంలో శరణు కోరడం వలన తరువాత పద్మనాయకులకు రెడ్లకు యుద్ధాలు జరిగాయి. అందుచేత ఈయన గురించి ఇక్కడ విస్తారంగా చెప్పాల్సి వస్తుంది.

అనపోతారెడ్డి రాజ్య మధ్యకాలం తరువాత తెలుగు చోడుడు అయిన ఏరువ వంశానికి చెందిన భక్తిరాజు ముందుగా అనపోతారెడ్డి సామంతుడు అయినప్పటికీ తరువాత అయన మీద తిరుగుబాటు చేసాడు. భక్తిరాజు రెడ్డి రాజుల సామంతుడిగా ఉండగా ఒకసారి బహమనీ సుల్తాను అధికారులను ఓడించాడు. ఆయన రెడ్డి రాజులు గజపతుల మీద యుద్ధానికి పోయినపుడు వారితో కలసి పోయి గజపతులను ఓడించి, అప్పటికే గజపతుల ఆక్రమించుకున్న కొప్పుల నాయకుల కోరుకొండ ప్రాంత భూభాగాన్ని వారికి తిరిగి ఇచ్చాడు.  

తదుపరి భక్తిరాజు గోదావరి ప్రాంతంలో స్థిరపడి అక్కడ రెడ్డి సామంతుడిగా ఒక చిన్న రాజ్యం ఏర్పాటు చేసుకున్నాడు. బహమనీ సుల్తానులు రెడ్డి రాజ్యం మీద దాడి చేసినపుడు అందులో కలిగిన అవ్యవస్థ ను చూచి భక్తిరాజు అనపోతా రెడ్డి రాజ్యం మీద తిరుగుబాటు చేసాడు. అప్పుడు తిరుగుబాటును అణచడానికి వచ్చిన రెడ్డి సైన్యాన్ని అయన సురవరం ( బహుశ ఇప్పటి నూజివీడు దగ్గర ) దగ్గర ఓడించాడు. అక్కడ ఆయన కామపురి అనే నగరాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడినుండి పాలించాడు. 1356  సంవత్సరానికి గోదావరి delta lo బహమనీ సుల్తానుల ఆక్రమణ వలన రెడ్డి రాజ్యం అంతరించింది.

 1373  సంవత్సరంలో అనవేమా రెడ్డి తిరిగి జయించిన తరువాత అది మరల రెడ్డి రాజ్యం లోనికి వచ్చింది. ఈ మధ్య కాలంలో భక్తిరాజు తన రాజ్యాన్ని బలపరిచాడు.   అనవేమా రెడ్డి గోదావరి డెల్టా ప్రాంతానికి సైన్యాన్ని మోహరించి 1377  సంవత్సరానికి ముందు కాలంలో దాన్ని జయించాడు. ఆయన అక్కడితో ఆగకుండా సింహాచలం వరకు ఉన్న ప్రదేశాన్ని జయించాడు. అనపోతారెడ్డి మంత్రి అయిన చెన్నమ నాయుని శాసనం 1375  సంవత్సరంలో వేయించబడింది సింహాచలంలో ఉంది. ఈ ప్రాంతాల మీద అనపోతారెడ్డి కి 1381  సంవత్సరం వరకు పట్టు ఉందని ఆయన ద్రాక్షారామ శాసనం తెలుపుతుంది.

అనవేమా రెడ్డి  తన పుత్రిక ను భక్తిరాజు పుత్రుడైన భీమలింగని కి (అనబడే చోడ భీమునికి ) ఇచ్చి వివాహం చేసాడు. వారికి పుట్టిన పుత్రిక పేరు వేమాంబ. చోడ భక్తిరాజుకు అన్నదేవ చోడుడు అనబడే ఇంకొక పుత్రుడు కూడా ఉండెను. ఈయన ఎదుగుదలకు ఇచ్ఛ  గల ఒక శక్తివంతమైన రాకుమారుడు. తన తండ్రి మరణం తరువాత సింహాసనాన్ని అలంకరించాలి అని కోరిక ఉన్నవాడు. భక్తిరాజు మృతి అనంతరం జరిగిన అతర్యుద్ధంలో అన్నదేవ చోడుడు గెలిచి సింహాసనం అధిష్టించెను. అన్నదెవ చోడుడి రాజ్య వైశాల్యం అయన రాజమహేంద్రవరం శాసనం నుండి తెలుస్తుంది. అందులో ముఖ్య ప్రాంతాలు భీమవరం, వేంగినాడు అనగా ఏలూరు పరిసర ప్రాంతం. ఇవి కాక రాజమహేంద్రవరం, కోరుకొండ ప్రాంతాలు కూడా ఈ రాజ్యంలోనివే. ఈయన వలన రెడ్డి రాజుల  సీమ కృష్ణా నదికి పడమటి  ప్రాంతానికి పరిమితం అయినది.

ఆయన అన్న, అనవేమారెడ్డి అల్లుడు అయిన చోడ భీముడు అప్పుడు అనవేమారెడ్డి శరణు కోరగా అనవేముడు అది సాకుగా తీసుకుని కృష్ణా నదికి తూర్పు ప్రాంతానికి వచ్చి అన్నదేవ చోడుడిని ఓడించి ఆయన పాలించిన ప్రదేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఈ దండయాత్రలో రాజమహేంద్రవరానికి చెందిన దొడ్డా రెడ్డి ఆయన కుటుంబం అనవేమునికి సాయం చేసారు. దొడ్డా రెడ్డి దువ్వూరి కుటుంబానికి చెందిన పెరుమాండీ  రెడ్డి 5 గురు పుత్రులలో ఒకడు. తరువాత దొడ్డారెడ్డి పుత్రులలో ఒకడైన అల్లాడ రెడ్డి చోడ భీముని పుత్రికను వివాహం చేసుకున్నాడు.  అప్పటికి కోరుకొండ రాజధానిగా దాని పరిసరాలతో సహా రాజమహేంద్రవరం వరకు మంచికొండ ముమ్మిడి నాయకుడు  ఏలుతున్నాడు. ఈ యుద్ధంలో అనవేమా రెడ్డి అన్నదేవ చోడుని సామంతులైన మంచికొండ నాయకులను కూడా ఓడించాడు. కొప్పుల నాయకులు ఒకప్పుడు పిఠాపురం పరిసర ప్రాంతాన్ని పాలించారు కానీ తరువాత మంచికొండ నాయకులచే ఓడించబడి తుని ప్రాంతానికి మారిపోయారు. అనవేముడు తన దండయాత్రలో  వారిని కూడా ఓడించాడు.

అనవేముడు ఈ తూర్పు దండయాత్రలో అంతటితో ఆగకుండా ముందుకు సాగి కళింగ ప్రాంతాన్ని సింహాచలం వరకు కూడా జయించాడు. అనవేమా రెడ్డి ఈ రాజ్య విస్తరణ చేస్తుండగా రెండవ పక్కనుండి విజయనగర రాజ్యం బుక్కరాయలు I  నాయకత్వంలో ముందుకు చొచ్చుకుని వచ్చి నర్సరావుపేట వరకు విస్తరించింది. రెండవ వైపు రాచకొండ అనపోతా మాదానాయకులు ముందుకు చొచ్చుకునిపోయి ఓరుగంటిని జయించి మొత్తం తెలంగాణా ప్రాంతాన్ని తమ ఏలుబడిలోకి తెచ్చుకున్నారు.

వెలుగోటివారి వంశావళి ప్రకారం అనవేమారెడ్డి  మాదా  అనబడే సింగభూపాలుడి (సింగమనాయక II ) పుత్రుని ముట్టడించి, ఓడి పారిపోయాడు. కాని ఈ యుద్ధం ఎక్కడ జరిగిందో వెలుగోటివారి వంశావళి లో లేదు. ఆ తరువాత వెలుగోటివారి వంశచరిత్ర, రావువారి వంశ చరిత్ర రెండూ కూడా సింగభూపాలుడి ఇంకొక పుత్రుడైన అన్న (అనపోతా II ) అనవేమారెడ్డి ని యుద్ధంలో ఓడించి వధించాడు అని ఉంది. ఈ యుద్ధం కూడా ఎక్కడ జరిగిందో ప్రస్తావన లేదు. పద్మనాయకులు తమ శరణు వేడిన అన్నదేవ చోడుని కి ఆయన రాజ్యం తిరిగి ఇప్పించలేకపోయారు కాబట్టి వారు అనవేమారెడ్డి ని గెలిచినా కూడా అది పూర్తి విజయం కాదు అని తెలుస్తుంది. పైగా పద్మనాయకులు అనవేమారెడ్డి భూభాగం లో ఏమీ ఆక్రమించలేకపోయారు. అది ఒక పూర్తి విజయం అయితే ఆలా జరుగును కాదు.  అందుచేత ఈ పద్మనాయక- రెడ్డి యుద్ధ విశేషాలు మనకు తెలియవు.

దీనికి ఒక చరిత్రకారుడు రెడ్ల పక్షం వహించి ఒక వక్ర భాష్యం చెప్పాడు. నల్గొండ లోని వాజిరాబాద్ లో  ఒక కడియం పోతినాయకుడి శాసనం ఉంది. ఆయన అనవేమా రెడ్డి సోదరుడు అయిన అన మాచ రెడ్డి భృత్త్యుడు. అందుచేత అనపోతా మాదానాయకులు అనవేమారెడ్డి చేత ఓడించబడి రాచకొండ లోని కొంత భూభాగం కోల్పోయారు అని ఆయన కధనం. కానీ విషయం ఏమిటంటే ఆ  వాజిరాబాద్ కృష్ణా నది దాటగానే దాని ఒడ్డున నల్గొండ జిల్లాలో ఉంది. అంటే అనవేమారెడ్డి రాచకొండ రాజ్యంలో ప్రవేశించడానికి ప్రయత్నించి ఆ ప్రాంతంలో విడిది చేసి ఉండగా ఆయన భృత్యుడు ఆ శాసనం వేయించి ఉండవచ్చు కదా. రాసి ఉన్న దానిని కాదు అని చెప్పి లేని దానిని ఆపాదించడం సమంజసం కాదు.  

ఈ రాసిన ఆయన ఏమి చిన్నవాడు కాదు. పెద్ద చరిత్రకారుడు. కానీ ఆయన చెప్పినట్టుగా నిజంగా అనవేమారెడ్డి అనపోతా మాదా నాయకులను ఓడిస్తే మరి ఆలా ఓడించారు అని రెడ్ల చరిత్రలో ఎందుకు రాయబడలేదు? అనపోతా మాదా నాయకులు గెలిచారు అని రాసి ఉన్నది తప్పు కానీ రాయనిది సరి అయినదా? కనీసం చరిత్రకారులు ఇలాంటి వివక్షత తో కూడిన రాతలు రాయకూడదు.

దానికి మళ్ళీ ఇంకో శాసనం సాయంగా చూపాడు ఆ చరిత్రకారుడు. అది ఏమిటంటే దేసట్ల గోత్రుడైన అన్నమనాయకుడు నల్గొండ లోని బూరుగుగడ్డ వద్ద ఒక శాసనం వేయించాడు. ఈ బూరుగుగడ్డ కూడా కృష్ణా నది దాటి నల్గొండ లో ప్రవేశించగానే ఉన్న ప్రదేశం. ఆ శాసనంలో ఆయన ఎవరి భృత్యుడో చెప్పబడలేదు. ఆయన పద్మనాయక భృత్యుడే అయ్యి ఉండవచ్చు కదా. ఈ చరిత్రకారుడి తర్కం శ్రీశైలం (అనవేముని చేత శ్రీశైలం విజయనగర  సామ్రాజ్యం నుండి జయించబడి కాబట్టి )మరియు వాడపల్లి శాసనాలలో పింగళ నామ సంవత్సరం వాడబడింది. అవి రెడ్డి సామ్రాజ్యంలో ఉన్నాయి కాబట్టి అదే పింగళ నామ సంవత్సరం ఈ శాసనంలోనూ వాడబడింది కాబట్టి ఈయన కూడా రెడ్లకు భృత్యుడే అని ఆ చరిత్రకారుడు చెప్పాడు. ఇంత చెత్త తర్కం నేను ఎక్కడా చూడలేదు.  

దాని తరువాత ఆయన అనపోతా మాదా నాయకుల చేతిలో పరాజయం పొంది ఉండవచ్చు కదా. ఆలా పరాజయం పొందాడు అని వెలుగోటివారి వంశావళి లో రాసి ఉంది కూడా. అందుచేత ఇది నిజం కాని ఏదో కుంటి తర్కంతో రాసి ఉన్నదానికి సరిగా విరుద్ధం ఐనది నిజం అని చెప్పడం, అది కూడా సరి అయిన రుజువులు లేకుండా, అంతటి పండితునికి అస్సలు తగదు. 

JOGINAPALLI NRUPENDER RAO-ENTREPRENUER FROM THE VELAMA COMMUNITY

  I was compiling a brief on the VIP’s of Padmanayaka Velama and in the process came across the name of Nrupender Rao garu  (Joginapally Ven...