Sunday, May 12, 2019

History of the Rachakonda Kingdom



వెలమ చరిత్రలో ఒక చిన్న భాగం.
రేచెర్ల ప్రభువులు మరియు ఇతర పద్మనాయకులు కాకతీయ యుగం నుండే ప్రాముఖ్యత పొందారు. రేచర్ల ప్రభువులు నల్గొండ లోని రాచకొండ దుర్గం నుండి వారి రాజ్యాన్ని పరిపాలించారు.

శాసనాల ప్రకారం రాచకొండ సామ్రాజ్యం స్థాపించినవాడు దాచానాయకుడు. ఆయనకు ఎరదాచానాయకుడు  అనే ఇంకొక నామం కూడా ఉంది. కానీ "వెలుగోటివారి వంశావళి" ఆయనకు ముందు మూడు తరాలు కూడా చెప్పి బేతాళ రెడ్డి లేదా చెవి రెడ్డి వంశానికి మూల పురుషుడు అని ఉటంకిస్తుంది.

వెలమలు మరియు రెడ్లు కూడా పిల్లలమఱ్ఱి అనుమగాల్లు ప్రదేశానికి చెందినవారే కావటం వల్ల దానికి తోడు రెడ్ల లో కూడా రేచెర్ల గోత్రం ఉండటం వల్ల, వంశావళి తరువాతి కాలం లో రాయబడటం వల్ల, బహుశా ఇది సరి కాకపోవచ్చు అని చరిత్రకారుల అభిప్రాయం. తరువాత వెలమలు ఎవరికీ రెడ్డి అనే నామం  లేకపోవడం దానికి ఒక రుజువు.  

రేచెర్ల వంశానికి చెందినవారిలో మనకు తెలిసిన మొట్ట మొదటి వారు దామ, ప్రసాదిత్య మరియు రుద్ర నాయకులు. వీరు ముగ్గురు కాకతీయ గణపతిదేవుని కొలువులో సేవ చేసారు. ముగ్గురిలో ప్రసాదిత్య నాయకుడు ప్రసిద్ధుడు.
గణపతిదేవుని మృతి తరువాత ఆయనకు పురుష సంతతి  లేకపోవడం వల్ల రుద్రమ దేవి రాజ్యానికి రాణిగా రావడాన్ని కొంత మంది సామంతులు, సైన్యాధిపతులు నిరసించారు. రేచెర్ల ప్రసాదిత్య  నాయకుడు కాయస్త అంబదేవుడితో మరియు గోన గన్నా రెడ్డి తో కలసి నాయకులను ఓడించి రుద్రమ దేవి ని సింహాసనం అధిస్టింప చేసాడు. దానికి మెచ్చి ఆమె ప్రసాదిత్య నాయకుడి కి, అంబదేవుడికి "కాకతీయ రాజ్య స్థాపనాచార్య" అనే బిరుదు ఇచ్చింది.  

రేచెర్ల దామానాయకుడి కి ఇద్దరు పుత్రులు, వెన్నమనాయకుడు మరియు సబ్బినాయకుడు ఉన్నారు. వెన్నమనాయకుని పుత్రుడే పైన చెప్పిన రాచకొండ రాజ్యాన్ని స్థాపించిన దాచానాయకుడు.  

రేచెర్ల దాచానాయకుడి కి ముగ్గురు పుత్రులు. సింగమ, వెన్నమ మరియు యాచమ నాయకులు. దాచానాయకుడు మరియు అతని పుత్రుడు ఐన సింగమనాయకుడు ప్రతాపరుద్రుని సైన్యాధిపతులు.

ప్రతాపరుద్రుడు 1316  సంవత్సరంలో పాండ్యుల రాజధాని కంచి ని ముట్టడించినపుడు వీరు ఇరువురు గొప్ప పరాక్రమం చూపించి ప్రతాపరుద్రుని యుద్ధం గెలిచేలా సాయపడ్డారు. దానికి అయన దాచానాయకుడి  కి 'పంచపాండ్యదల విభాల" అనే బిరుదుని ఇచ్చి సత్కరించాడు.

ఇది నేను ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము నుండి సంకలనం చేసి రాసాను.
వెలమ చరిత్రలో ఒక చిన్న భాగం-2

కాకతీయ సామ్రాజ్యం అంతా 1323  సంవత్సరంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ యుద్ధం తర్వాత తుగ్లక్ ల పరం అయ్యింది. ఆ 1323  సమరం లో పెక్కు మంది కాకతీయ ముఖ్య నాయకులు అందరు మరణించారు. అందులో రేచెర్ల దాచానాయకుడు ఒకడు.

అప్పుడు 1335  సంవత్సరంలో కాకతీయుల మంత్రి ఐన బెండపూడి అన్నయ ప్రోద్బలంతో తుగ్లక్ ల తో పోరాడటానికి కాకతీయ సైన్యాధిపతులు అందరు కమ్మవాడు ఐన ముసునూరి కాపానాయకుని సారధ్యంలో సమైక్యం అయ్యారు. అందులో రేచెర్ల దాచానాయకుని  కుమారుడు ఐన సింగమనాయకుడు ఒకడు. వారు 5  సంవత్సరాల సమయంలో తుగ్లక్ ల నుండి ఆంధ్ర సామ్రాజ్యాన్ని విముక్తం చేసారు.  

ఒకసారి తుగ్లక్ ల బెడద తొలగిపోగానే సమైక్యం ఐన నాయకులలో ఐకమత్యం లోపించింది. వారు ఎవరికి వారే తమ సామ్రాజ్య విస్తరణలో పడ్డారు. అప్పుడు సింగమనాయకుడు కూడా తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేసాడు. కాపానాయకుడు బహమనీలతో పోరాడుతుండగా సింగమనాయకుడు దక్షిణ ఆంధ్ర దేశంలో ఉన్న నాయకులు అందరిని ఓడించి తన రాజ్యాన్ని కృష్ణా నది తీరం వరకు విస్తరింపచేసాడు. అయన తన రాజ్యాన్ని కృష్ణా నది ఉత్తరాన కూడా విస్తరింపచేయదలచి కాపానాయకుని ముట్టడించాడు. వెలుగోటివారి వంశావళి ప్రకారం అయన కాపానాయకుడిని ఓడించాడు.

కానీ ఈ విజయం వలన సింగమ కు ఏమి లాభం చేకూరినట్టు కనిపించదు ఎందుకంటే 1357  లో వేయించిన కాపానాయకుని పిల్లలమఱ్ఱి శాసనం ప్రకారం కాపయ రాజ్యం కృష్ణా నది ఉత్తరాన ఉన్న పిల్లమర్రి వరకు వ్యాపించి ఉంది.    

సింగమనాయకుడు తన సామ్రాజ్య విస్తరణలో భాగం గా ఇప్పటి విజయవాడ దగ్గర ఉన్న జల్లిపల్లి దుర్గాన్ని ముట్టడించాడు. ఆ దుర్గం అప్పుడు సోమవంశ క్షత్రియుల స్వాధీనంలో ఉంది. అప్పటికే సింగమనాయకుడు వృద్ధుడు కానీ ఒక గొప్ప వీరుడిగా పేరు గాంచాడు. ఆయనను యుద్ధంలో ఓడించడం కష్టం అని దుర్గాధిపతులు ఐన సోమవంశ క్షత్రియులు ఒక కుతంత్రాన్ని రచించారు. దానిలో వారికీ రెడ్లు సాయపడ్డారు.

ఆ కుతంత్రం ప్రకారం సోమవంశ క్షత్రియులు సింగమనాయకుడి బావమరిది ఐన చింతపల్లి సింగమ ను అపహరించి దుర్గంలో బంధించారు.  అయన ఆయన విడుదల  మంతనాల కోసం సింగమనాయకుడి ని దుర్గం లోకి ఆహ్వానించారు. అయన వారితో మంతనాలు చేస్తుండగా వారి సామంతుడు, ఒక దుర్గాధిపతి ఐన తంబళ్ళ బొమ్మ జియ్యరు విషప్రయోగం చేసి సింగమనాయకుడిని హతమార్చారు.  

సింగమనాయకుడు కుతంత్రం తో మృతి చెందగానే అయన కుమారులు ఐన అనపోతానాయకుడు, మాదానాయకుడు వారి బలాలను సమకూర్చుకుని 1361  సంవత్సరం లో జల్లిపల్లి దుర్గాన్ని ముట్టడించారు. వారు సోమవంశ క్షత్రియులను, వారికి సహాయం చేసినవారిని వధించి దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు చావగా మిగిలిన సోమవంశ క్షత్రియులు కళింగ గజపతులను శరణు వేడుకున్నారు. వారే ఈనాటి విజయనగర రాజులు.  

అనపోతానాయకుడు, మాదానాయకుడు అంతటితో ఆగకుండా సోమవంశ క్షత్రియుల్లకు సాయం చేసిన రెడ్లను, తెలుగు నాయకుల రాజ్యాలను కూడా ముట్టడించారు.

వెలమ చరిత్రలో ఒక చిన్న భాగం-3
'వెలుగోటివారి వంశావళి" ప్రకారం అనపోతానాయకుడు, మాదానాయకుడు యుధాలలో అనేక విజయాలు సాధించారు. వీటిలో చాలా విజయాలు కృష్ణా నదికి దక్షిణ తీరాన గుంటూరు, నెల్లూరు మరియు కర్నూలు  జిల్లాలలోనివి.  వారు శ్రీశైలం వరకు వచ్చి యుద్ధాలు చేసారు అనేదానికి సాక్ష్యం కూడా ఉంది.

కాలంలో రాసిన "రసవర్ణ సుధాకరము' అనే గ్రంధంలో అనపోతానాయకుడు శ్రీపర్వతానికి మెట్లు కట్టించాడు అని, వింధ్య పర్వతాలకు శ్రీశైలానికి మధ్య ఉన్న భాగాన్ని ఏలుతున్నాడు అని రాసి ఉంది. సమయంలో శ్రీశైలం రెడ్ల సామ్రాజ్యంలో ఉండేది. ప్రదేశాన్ని ఆక్రమించి ఉన్నపుడే రాచకొండ రాజ్యానికి రెడ్డి రాజ్యానికి మధ్యన యుద్ధం ప్రారంభం అయ్యింది. వెలుగోటివారి వంశావళి ప్రకారం మాదానాయకుడు, అయన చిన్నాన్న ఆయన నాగానాయకుడు కలసి అనపోతా రెడ్డి ని ధరణికోట వద్ద యుద్ధంలో ఓడించారు. కానీ యుద్ధం గెలిచినా కూడా ధరణికోట వారి చేతిలోకి రాలేదు.

ఇది వెలమల మరియు రెడ్ల మధ్య జరిగిన మొదటి యుద్ధం. అప్పటినుండి కొండవీటి రెడ్డి రాజ్యం అంతరించేదాకా శత్రుత్వం అంతరించలేదు.

తన ధరణికోట విజయం తరువాత అనపోతానాయకుడు, ముసునూరి కాపానాయకుని రాజ్యం ఆయన ఓరుగల్లు ను ముట్టడించాడు. అప్పటికే కాపానాయకుని రాజ్యం బహమనీ   దండయాత్రల వల్ల బలహీనపడింది.  వరంగల్ దగ్గర ఉన్న "భీమవరం" లో వారి సైన్యాలు తలపడ్డాయి. యుద్ధంలో అనపోతానాయకుడు, కాపానాయకుని మీద విజయం సాధించాడు. యుద్ధం 1369  సంవత్సరంలో జరిగి ఉండవచ్చు ఎందుకంటే సంవత్సరంలో అనపోతానాయకుడు వేయించిన 'ఐనవోలు" శాసనం ప్రకారం త్రిభువనగిరి (భోంగిర్), ఓరుగల్లు మరియు సింగవరం దుర్గాలు అనపోతానాయకుని అధీనంలో ఉన్నాయి. విజయంతో అనపోతానాయకుని రాజ్యం ఉత్తరాన గోదావరి నది వరకు, దక్షిణాన శ్రీశైలం వరకు,  తూర్పున కొండవీడు వరకు, పడమరన బహమనీ రాజ్యం వరకు విస్తరించి ఉంది.   
వెలమ రాజ్యానికి బహమనీ రాజ్యం తో మంచి సంభందాలు ఉన్నాయి. దాన్ని బట్టి చూస్తే బహుశా వారు కాపానాయకుని మీద దండెత్తినపుడు బహమనీ సహాయం కూడా పొంది ఉండవచ్చును. కొద్దీ కాలం తరువాత అనపోతనాయకుడు తన రాజ్యాన్ని పాలన సమర్ధవంతంగా ఉండటం కోసం రెండుగా విడతీసి రెండో భాగానికి తన తమ్ముడు అయిన మాదానాయకుడిని దేవరకొండ రాజధానిగా రాజుని చేసాడు. దేవరకొండ రాజ్యం రాచకొండ రాజ్యానికి లోబడి ఉండేది.

అనపోతానాయకుని సింహాచలం శాసనం ప్రకారం 1380  సంవత్సరం లో కళింగ రాజ్యం మీద దండెత్తాడు. దాడిలో జరిగిన విషయాలు మనకు తెలియవు కానీ వెలుగోటివారి వంశావళి లో మాత్రం కళింగ దండయాత్ర మీద ఏమీ సమాచారం లేదు. అనపోతానాయకుడు 1384  సంవత్సరం వరకు రాజ్యం చేసాడు.

వెలమ చరిత్రలో ఒక చిన్న భాగం-4

అనపోతానాయకుని తదుపరి అయన కుమారుడు ఐన సింగమనేడు II  1384 సంవత్సరం లో రాజ్యానికి వచ్చాడు. ఆయనకు కుమార సింఘ భూపాలుడు అనే నామాంతరం కూడా ఉంది. అయన సింహాసనానికి రాక ముందే బహమనీ సుల్తానుల సహాయం కోసం వెళ్లి కర్ణాటక లోని గుల్బర్గా జిల్లా లోని కళ్యాణి దుర్గాన్ని జయించాడు.
సింఘ భూపాలుడు రాజ్యానికి వచ్చిన కొత్తలో విజయనగర సైన్యాలు శ్రీశైలాన్ని జయించి రాచకొండ రాజ్యం మీద దండయాత్ర చేసాయి.

1384  సంవత్సరం  లో కర్ణాటక లోని తుంకూర్ జిల్లాలో వేయించిన విజయనగర శాసనం ప్రకారం విజయనగర రాజు ఐన హరిహర దేవరాయలు II  తన కుమారుడు ఐన వీర బుక్కరాయలను రాచకొండ రాజ్యంలో ఉన్న ఓరుగల్లు మీదకు పంపించాడు. అప్పుడు బహమనీ సుల్తాన్ రాచకొండ సహాయం కోసం వచ్చి విజయనగర్ సైన్యాలు అప్పటికే వశం చేసుకున్న మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తకొండ ను ముట్టడించాడు. యుద్ధంలో విజయనగర సేనాని ఐన సాళువ రామదేవరాయలు మరణించాడు.

శాసనం ప్రకారం యుద్ధంలో విజయనగర సైన్యాలు ఓడిపోయాయి. శాసనం ప్రకారం బహమనీ సుల్తాన్ తన సామంతులను రక్షించడానికి విజయనగం సైన్యాలతో పోరాడాడు. కానీ రాచకొండ బహమనీ సామంత రాజ్యం అని ఎక్కడా రుజువులు లేవు. కానీ రాచకొండ బహమనీ రాజ్యాలు స్నేహంతో ఉండేవి. బహుశా వారి మధ్య ఏదైనా యుద్ధ ఒప్పందం ఉండి  ఉండవచ్చు.

రాచకొండ రాజ్యం మీద విజయనగర రాజ్యం యొక్క దాడికి కారణాలు ఏవి కనబడవు కానీ ముస్లిం చరిత్రకారుడు ఐన జియాఉద్దీన్ బారాని  ప్రకారం హరిహర రాయలు కాపానాయకుడు బంధువులు, అందుకే దాడి జరిగింది అని. కానీ దానికి చారిత్రకంగా ఆధారాలు లేవు. బహుశా వారు మంచి స్నేహం కలిగి ఉండవచ్చు. బహుశా కాపానాయకుని పరాజయం, బహమనీలతో రాచకొండ ప్రభువుల స్నేహ వైఖరి వల్ల వారు దాడి చేసి ఉండవచ్చు.
1387  సంవత్సరం లో సింగభూపాలుడు తన వశంలో ఉన్న దక్షిణ కళింగ ప్రాంతం నుండి గౌతమీ నది తీర ప్రాంతం మీద దాడి చేసాడు. ప్రాంతం అప్పుడు కొండవీడు రాజ్యంలో భాగం. అయన సింహాచలం శాసనం ప్రకారం అందులో ఆయన విజయం సాధించాడు. దానితో దక్షిణ కళింగ ప్రాంతంలో రెడ్ల అధికారం నశించిపోయింది.

విజయనగం రాజు ఐన హరిహర దేవరాయలు రాచకొండ చేతిలోనూ బహమనీ చేతిలోనూ ఐన తన పరాజయం మరచిపోలేదు. 1397  సంవత్సరం లో అయన బహమనీ రాజ్యం మీద యుద్ధం ప్రకటించాడు. యుద్ధంలో ఒక విజయనగం సేనాని ఐన గుండ దండాధినాథుడు బహమనీ సైన్యాధిపతులు ఐన  సైఫ్ ఖాన్ మరియు ఫతేహ్ ఖాన్ మీద విజయం సాధించాడు. 

బహమనీ మీద వియజయనగర  సైన్యాల ఒత్తిడిని తగ్గించడానికి సింగభూపాలుడు దేవరకొండ ఏలుతున్న వేదగిరినాయకుని కొడుకు ఐన రామచంద్ర నాయకుడిని కృష్ణా తీర ప్రాంతంలో ఉన్న విజయనగర రాజ్యాన్ని ముట్టడించడానికి పంపాడు. రామచంద్రనాయకుడు కృష్ణా నదిని దాటి కర్నూలు లో ప్రవేశించి దానిని కొల్లగొడుతుండగా బండికనుమ దగ్గర విజయనగర సైన్యాలు ఆయనను అడ్డుకున్నాయి. యుద్ధంలో రామచంద్రనాయకుడు విజయం సాధించాడు.


హరిహరదేవరాయలు అప్పుడు తన పుత్రుడు ఐన వీర బుక్క రాయలను రామచంద్రనాయకుని అడ్డగించడానికి పంపాడు. వీర బుక్కరాయలు రామచంద్రనాయకుని ఓడించి తరువాత రాచకొండ రాజ్యంలో ప్రవేశించి దాన్ని కొల్లగొట్టాడు. రాచకొండ సైన్యాలు అప్పుడు ఆయనతో తిరిగి యుద్ధం చేసాయి. సింగభూపాలుడుకి, రామచంద్రనాయకుడికి మాదానాయకుని ఇంకొక పుత్రుడు ఐన పెదవేదగిరినాయకుడికి వంశావళి లో ఆపాదించబడిన విజయాలు యుద్ధంలోనే కలిగాయి. చివరికి రెండు రాజ్యాలు తామే గెలిచినట్టు చెప్పుకున్నాయి కానీ విజయనగర రాజ్యం యుద్ధంలో పై చేయి సాధించింది.  

వీర బుక్కరాయలు తన సైన్యాలతో కృష్ణా నదిని దాటి దేవరకొండ రాజ్యంలో ఉన్న పానుగంటి దుర్గాన్ని ముట్టడించాడు. అప్పుడు బహమనీ సుల్తానులు పానుగంటిని రక్షించడానికి తమ సైన్యాన్ని పంపారు. యుద్ధంలో పెదవేదగిరినాయకుని కుమారుడు ఐన కుమార మాదానాయకుడు విజయనగర సైన్యాధిపతులు ఐన ఎర  కృష్ణరాయలను, పండాది దాస  ను ఓడించాడు. యుద్ధంలో ఓడినప్పటికీ వీర  బుక్కరాయలు తిరిగి గెలిచి 1397  సంవత్సరం లో పానుగల్లు దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. యుద్ధంలో వీర బుక్కరాయల కొడుకు ఐన అనంత భూపాలుడు గొప్ప పరాక్రమం చూపించాడు.  

పానుగంటి యుద్ధం ఐన కొద్ది  కాలానికే 1399 లో సింగభూపాలుడు మరణించాడు.

వెలమ చరిత్రలో ఒక చిన్న భాగం-5

సింగభూపాలుని తరువాత అయన కుమారుడు ఐన ఇమ్మడి అనపోతనాయకుడు 1399  సంవత్సరంలో రాజ్యానికి వచ్చాడు. అతనికి కుమార అనపోతానాయక మరియు పిన్నమనాయక అనే నామాంతరాలు ఉన్నాయి. అయన బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షా యొక్క సమకాలికుడు.

బుక్కరాయలనుండి సామ్రాజ్యాన్ని కాపాడుకునే భారం అయన మీద పడింది. వెలుగోటివారి వంశావళి ప్రకారం అయన మెదక్ దుర్గం నుండి 10 ,000  మందిని రక్షించాడు.  బహుశా బుక్కరాయలు మెదక్ దుర్గం వరకు వెళ్లి దాన్ని ముట్టడించగా ఇమ్మడి అనపోతానాయకుడు వచ్చి తన దుర్గాన్ని రక్షించుకున్నాడు. 

వెలుగోటివారి వంశావళి ప్రకారం ఈయనకు అనేక విజయాలు ఆపాదించబడ్డాయి. బహమనీ సుల్తానుల పక్షాన వహించి ఇమ్మడి అనపోతానాయకుడు కొండవీడు, రాజమహేంద్రవరం రెడ్డి రాజుల మీద, విజయనగర సామ్రాజ్యం మీద పెక్కు విజయాలు పొందాడు. వంశావళి ప్రకారం అయన విజయనగర రాజునూ నిలవరించాడు. బహుశా ఆ రాజు దేవరాయ I  అయ్యి ఉండవచ్చు.   

ఇమ్మడి అనపోతానాయకుని సమయంలో దేవరకొండను పెదవేదగిరినాయకుని పుత్రులు ఐన కుమార మాదానాయకుడు మరియు రామచంద్రనాయకుడు పాలించారు.

రెడ్డి రాజ్యాల చేత పదవీచ్యుతుడు ఐన అన్నదేవ చోడునికి పెదవేదగిరినాయకుడు తన రాజ్యంలో ఆశ్రయం ఇచ్చాడు. తరువాత కుమార మాదానాయకుడు ఆయనకు ఒక సైన్యాన్ని ఇచ్చి కళింగ రాజ్యం దారినుండి లోని ఆయన రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి పంపాడు. ఈ సైన్యాన్ని 1402  సంవత్సరం లో గంగ రాజుల సామంతుడు ఐన చాళుక్య విశ్వేశ్వర భూపతి ఓడించాడు. తరువాత కుమార మాదానాయకుడు సైన్యాన్ని తీసుకుని అన్నదేవ చోడునికి సాయంగా వెళ్ళాడు. ఆయనకు రాజముండ్రి రెడ్డి రాజుల మీద ఐన విజయం బహుశా ఈ సమయం లోనే కలిగింది.

1417  సంవత్సరం లో కుమార మాదానాయకుడు పానుగల్లు దుర్గాన్ని ముట్టడించి విజయం సాధించాడు. అప్పటికి ఆ దుర్గం వియజయనగర సామ్రాజ్యం చేతిలో ఉంది. ముందుగా వారి మధ్య ఒప్పందం ప్రకారం బహమనీ సుల్తాన్ ఐన తాజుద్దీన్ ఫిరోజ్ షా పానుగంటి దుర్గాన్ని ముట్టడించాడు. వెలమనాయకులు  తమ సైన్యాలతో బయలుదేరి ఫిరోజ్ షా కి మద్దతుగా వెళ్లారు.

కానీ ఏమి జరిగిందో ఏమో  కానీ ఆ ముట్టడి సమయంలో వారి మధ్య సంభందాలు చెడిపోయాయి. అదను చూసుకుని దేవరాయ I  వెలమనాయకులతో సంప్రదింపులు సలిపి వారిని తనవైపు తిప్పుకున్నాడు. సమరం సంకులం గా జరుగుతుండగా వెలమనాయకులు తమ సైన్యాలను తీసుకుని దేవరాయ I  తో చేరిపోయారు. దానితో అప్పటికి విజయ సమీపంలో ఉన్న ఫిరోజ్ షా ఓడిపోయి అతి కష్టం మీద తప్పించుకుని తన రాజధాని ఐన గుల్బర్గా చేరుకున్నాడు.

అది ఒక గొప్ప నమ్మక ద్రోహం. సామ్రాజ్యం ఆవిర్భవించిన దగ్గరనుండి తమ పక్షాన ఉన్న బహమనీ సుల్తాను ను యుద్ధ సమయంలో విడిచి శత్రువు పక్షాన చేరటం వెలమ వీరులకు మంచి పని కాదు. వారు చేసిన ఆ ద్రోహమే చివరికి రాచకొండ దేవరకొండ రాజ్యాలను అంతరించేలా చేసింది. ఇమ్మడి అనపోతానాయకుడు కూడా 1421 లో పానుగంటి యుద్ధంలో మరణించాడు.
ఇమ్మడి అనపోతానాయకుని తరువాత రాచకొండకి దేవరకొండకి కలిపి కుమార మాదానాయకుడు రాజు అయ్యాడు. దానికి కారణం ఇమ్మడి అనపోతానాయకుని కుమారుడు ఐన సింగమనాయక II  (లేదా ముమ్మడి సింగమనాయకుడు అప్పటికి ఇంకా చిన్నవాడు. 

కుమార మాదానాయకుడు బహమనీ సుల్తానులతో వైరాన్ని కొనసాగించి వారి రాజ్యాన్ని తుదముట్టించాలి  అని చూసాడు. 1424  సంవత్సరంలో విజయనగర రాజు ఐన దేవరాయ II  మరియు బహమనీ సుల్తాన్ అహ్మద్ షా మధ్య ఐన యుద్ధంలో కుమార మాదానాయకుడు విజయనగర రాజ్య పక్షాన పోరాడాడు.
ఆ తరువాత అహ్మద్ షా దేవరాయ II  తో 1425  సంవత్సరంలో సంధి చేసుకుని తెలంగాణ మీద యుద్ధాన్ని  ప్రకటించాడు. అయన తన సైన్యాధిపతి ఐన అజిమ్ ఖాన్ ను ఓరుగంటి మీదకు పంపించాడు. అజిమ్ ఖాన్ ఓరుగంటి యుద్ధంలో గెలిచి దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దాని తరువాత వెలమల చేతిలో ఉన్న చాలా దుర్గాలను అయన గెలుచుకున్నాడు. చివరికి రాచకొండ రాజ్యం బహమనీ సుల్తానులతో సంధి చేసుకోవలసి వచ్చింది.
బహమనీ సుల్తాన్ అహ్మద్ షా గుజరాత్ సుల్తాన్ తో యుద్ధంలో ఉండగా అదను చూసుకుని వెలమలు  మళ్ళీ వారి దుర్గాలు అన్నీ స్వాధీనం చేసుకున్నారు.

వెలమ చరిత్రలో ఒక చిన్న భాగం-6

కుమార మాదానాయకుని తరువాత ఇమ్మడి అనపోతానాయకుని  పుత్రుడు ఐన ముమ్మడి  సింగమనాయకుడు 1430  సంవత్సరంలో రాచకొండ రాజ్యానికి వచ్చాడు. అతని పాలనలో రాచకొండ దేవరకొండ రాజ్యాలు క్షీణించడం మొదలుపెట్టాయి.   

బహమనీ సుల్తాన్ అహ్మద్ షా గుజరాత్, మాల్వా సుల్తానులతో తన యుద్ధం సమాప్తం అయ్యాక 1433  సంవత్సరంలో రాచకొండ సామ్రాజ్యం మీద దండెత్తి జయించాడు. ఆ యుద్ధంతో రాచకొండ, ఓరుగల్లు దుర్గాలను బహమనీ సుల్తాన్  స్వాధీనం చేసుకున్నాడు. కేవలం దేవరకొండ మాత్రం వెలమల చేతిలో మిగిలింది. ఆ సమయంలో దేవరకొండను కుమార మాదానాయకుని పుత్రుడు ఐన లింగమనాయకుడు పాలిస్తున్నాడు  అయన యుద్ధంలో పరాక్రమవంతుడు. 12  సంవత్సరాల వయసులోనే  ఆయన ఒక యుద్ధంలో పాల్గొన్నాడు. రాజముండ్రి రెడ్డి రాజ్యం మీద లింగమనాయుకుడు చేసిన దాడుల వల్ల అది క్షీణించి చివరికి నాశనం అయ్యింది.

1433  సంవత్సరం తరువాత  రాచకొండ, దేవరకొండ రాజ్యాలు పోయి కేవలం కొన్ని దుర్గాలు మాత్రమే పద్మనాయకుల వద్ద మిగిలాయి. అప్పుడు వారు తమ రాజ్యాన్ని తిరిగి వశపరుచుకోవటానికి ఒరిస్సా  గజపతుల సాయం కోరారు. వారి పిలుపున కపిలేశ్వర గజపతి బహమనీ సామ్రాజ్యంలోని తెలంగాణ ప్రాంతం మీద దాడి చేసి బహమనీ సుల్తాన్తు ఐన అల్లాఉద్దీన్ చేతిలో ఓడిపోయాడు. 1435 సంవత్సరం లో రాచకొండ రాజ్యాన్ని సుల్తాన్ తన తమ్ముడు ఐన మహమ్మద్ ఖాన్ కు ఇచ్చాడు. .   

పద్మనాయకులు అప్పుడు బహమనీ సుల్తాన్ హుమాయూన్ షా మీద తిరుగుబాటు చేసిన సికందర్ ఖాన్ ను సమర్ధించారు. అప్పుడు హుమాయూన్ షా సికందర్ ఖాన్ మీద దండెత్తి గెలిచి ఆయనను చంపేశాడు.

సికందర్ ఖాన్ ను సమర్ధించిన పద్మనాయకులను దండించటానికి బహమనీ సుల్తాన్ క్వాజా జహాన్ మరియు నిజాం ఉల్ ముల్క్ ల సారధ్యంలో 20,000  అశ్వ దళాన్ని, 40  ఏనుగులను మరియు పెక్కు సైనికులను పంపాడు. ఆ దళాలు వచ్చి పద్మనాయకుల చేతిలో ఉన్న దేవరకొండ దుర్గాన్ని ముట్టడించారు.

పరిస్థితి ని చూచి పద్మనాయకులు ఒరిస్సా కపిలేశ్వర గజపతి కి వచ్చి సహాయం చేయమని రాయబారం పంపారు. వారు ఆయనకు ఒక పెద్ద మొత్తం కూడా ఇస్తామని వాగ్దానం చేసారు. అప్పుడు కపిలేశ్వర గజపతి తన కుమారుడు ఐన హంవీరదేవుడి ( ముస్లిం చరిత్రకారులు ఈయనను అంబర్ రాయ్ అని ఉటంకిస్తారు)  సారధ్యం లో పెద్ద సైన్యాన్ని పద్మనాయకులకు సాయంగాను తెలంగాణ ప్రదేశాన్ని బహమనీ సుల్తానుల నుండి విముక్తం చేయటానికి పంపాడు.

హంవీరదేవుడి సైన్యాలు బహమనీ సైన్యాన్ని వెనకనుండి ముట్టడించగా ముమ్మడి సింగమనాయక మరియు లింగమనాయకులు దేవరకొండ దుర్గం నుండి బయటకి వచ్చి ముందు నుండి బహమనీ సైన్యాలను ముట్టడించారు. బహమనీ సైన్యాలు ఈ ఇరువైపుల ముట్టడిలో నలిగిపోయి ఒక ఘోర పరాజయం పొందాయి. క్వాజా జహాన్ మరియు నిజాం ఉల్ ముల్క్ కష్టం మీద యుద్ధ భూమి నుండి పారిపోయారు. ఈ పరాజయం గురించి తెలియగానే బహమనీ సుల్తాన్ ఐన హుమాయూన్ షా క్రోధంతో నిజాం ఉల్ ముల్క్ ను వధించి క్వాజా జహాన్ ను కారాగారంలో బంధించాడు. 

తరువాత ఈ యుద్ధాన్ని బహమనీ సుల్తాన్ తన దివాన్ ఐన మహమ్మద్ గవాన్ కు అప్ప చెప్పాడు. ఆ యుద్ధం గవాన్ కు మించిన పని అయ్యి బహమనీ సైన్యాలు ఒక ఓటమి తరువాత ఇంకో ఓటమి పొందారు. ఒకటొకటిగా దుర్గాలు అన్ని హంవీరదేవ, పద్మనాయకుల వశం అయ్యాయి. వారు రాచకొండ, భోంగిర్ మరియు ఓరుగల్లు దుర్గాలు గెలుచుకున్నారు. 

1461  సంవత్సరంలో ముమ్మడి సింగమనాయకుని తమ్ముడు ఐన రావు ధర్మానాయకుడు ఓరుగంటి రాజు అయ్యాడు. కానీ ఈ యుద్ధంతో పద్మనాయకులు తమ స్వాతంత్య్రాన్ని కోల్పోయి ఒరిస్సా  గజపతుల  సామంతులు అయిపోయారు. 

బహమనీ సుల్తాన్ హుమాయూన్ షా మరణం తరువాత నిజాం షా బహమనీ సుల్తాన్ అయ్యాడు. అయన తిరిగి తెలంగాణ ప్రదేశాన్ని పద్మనాయకుల దగ్గర నుండి వశం చేసుకుందాము అని సైన్యాన్ని పంపాడు, కానీ కపిలేశ్వర గజపతి పద్మనాయకులకు రక్షణగా పంపిన సైన్యం బహమనీ ల  సైన్యాన్ని ఓడించి బహమనీ రాజధాని నగరం ఐన బీదర్ వరకు చొచ్చుకుపోయింది. అప్పుడు హమీర్ జాదా  ముజీబుల్లాహ్ అనబడే బహమనీ సైన్యానాయకుడు గజపతుల సైన్యాల మీద వ్యూహాత్మక విజయం సాధించి బీదర్ ను రక్షించాడు. కానీ ఇది పూర్తి విజయం కాదు అందుచేత తెలంగాణ దుర్గాలు అన్ని పద్మనాయకుల  చేతుల లోనే ఉండిపోయాయి.

కపిలేశ్వర గజపతి జీవించి ఉన్నంత కాలం బహమనీ సుల్తానులు తెలంగాణా ను జయించలేకపోయారు . అది పద్మనాయకుల చేతుల లోనే ఉండిపోయింది. కపిలేశ్వర గజపతి 1470  సంవత్సరంలో మరణించాడు.

అప్పుడు బహమనీ సుల్తాన్ మాలిక్ నిజాం ఉల్ ముల్క్ బహ్రి ని తెలంగాణ జయించడానికి పంపాడు. ఈయన కేవలం తెలంగాణ ను జయించి ఊరుకోకుండా కొండవీడు రాజమహేంద్రవరం దుర్గాలను కూడా జయించాడు. ఓరుగల్లు రాజ్యాన్ని బహమనీ సుల్తాన్ అజిమ్ ఖాన్ కు 1475  సంవత్సరం లో ఇచ్చాడు. దానితో తెలంగాణ పద్మనాయక రాజ్యం నశించిపోయి పద్మనాయకులు హంపీ విజయనగర సంస్థానం లో చేరారు.


రేచెర్ల ఎర దాచానాయకుడు మొదటగా దాదాపు 1320  సంవత్సరం లో పద్మనాయక రాజ్యాన్ని స్థాపించాడు. కానీ అది కాకతీయుల సామంత రాజ్యం.

కాకతీయుల పతనం ఐన తరువాత ఆయన పుత్రుడు ఐన సింగమనాయకుడు మొదటిగా దాదాపు 1340  సంవత్సరం లో స్వతంత్ర రాజ్యం స్థాపించాడు.

ఈయన పుత్రుడు ఐన అనపోతానాయకుడు తన రాజధాని  ని దాదాపు 1360  సంవత్సరం లో  రాచకొండ కు కు మార్చి రాచకొండ రాజ్య స్థాపకుడు అయ్యాడు.

అంటే పద్మనాయక స్వతంత్ర రాజ్యం 1340  సంవత్సరంలో స్థాపించబడి 1475  సంవత్సరం వరకు 135  సంవత్సరాలు మొత్తం తెలంగాణా ప్రదేశాన్ని పాలించింది. కానీ 1461  సంవత్సరం నుండి పద్మనాయక రాజ్యం గజపతుల సామంత రాజ్యం అయిపొయింది. 





No comments:

Post a Comment

ORIGIN AND EVOLUTION OF THE VELAMAS.

The Velamas originally belonged to the area of Pillalamarri & Anumagallu in Nalgonda district. The origin of the Velama caste ca...